సనాతన ధర్మంలోని పండుగలు, పర్వదినాలు సమైక్యతత్వాన్ని, సమష్టి భావాన్ని ఆకాంక్షిస్తాయి. కుటుంబంలోని జీవన మాధుర్యానికి, సంప్రదాయ సౌరభానికి ప్రతీక- యమద్వితీయ. సహోదరుల మధ్య సదవగాహన, సౌమనస్య పూరిత ఆపేక్షల వృద్ధికి యమద్వితీయనాడు నిర్వహించే భగినీ హస్తభోజనం ఉపకరిస్తుంది. కార్తికంలో రెండో రోజైన శుద్ధ విదియను యమద్వితీయగా, సహోదర ద్వితీయగా వ్యవహరిస్తారు. సోదరసోదరీమణుల మధ్య ఉండే అపురూపమైన అనురాగ సరాగాల్ని ప్రకటించే వేడుక- భగినీ హస్తభోజనం. 'భగిని' అంటే సోదరి, భాగ్యవంతురాలని అర్థం. 'భగిని' చేతివంటను సోదరులు ప్రియమారా ఆరగించే పావన తరుణమే భగినీ హస్తభోజన పర్వదినం. కార్తిక శుద్ధ విదియనాడు సోదరీమణుల సమాదరణం చేయాలని లింగపురాణం ప్రస్తావించింది. అవ్యాజమైన అభిమానంతో సోదరుల్ని ఇంటికి పిలిచి తోబుట్టువులు వారికి సంతృప్తిగా భోజనాన్ని కొసరి కొసరి వడ్డించాలని, సోదరులు తమ అక్కాచెల్లెళ్లను ఘనంగా సత్కరించాలని భవిష్యపురాణం పేర్కొంది. నరకాసుర వధ అనంతరం, శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర ఇంటికి వెళ్లాడంటారు. ఆయనకు సుభద్ర విజయ తిలకాన్ని దిద్ది, మంగళహారతి నిచ్చి, మధుర పదార్థాల్ని తినిపించి, రక్ష కట్టిందంటారు. ఆ మ...