సహోదరుల మధ్య సదవగాహన, సౌమనస్య పూరిత

సనాతన ధర్మంలోని పండుగలు, పర్వదినాలు సమైక్యతత్వాన్ని, సమష్టి భావాన్ని ఆకాంక్షిస్తాయి. కుటుంబంలోని జీవన మాధుర్యానికి, సంప్రదాయ సౌరభానికి ప్రతీక- యమద్వితీయ. సహోదరుల మధ్య సదవగాహన, సౌమనస్య పూరిత ఆపేక్షల వృద్ధికి యమద్వితీయనాడు నిర్వహించే భగినీ హస్తభోజనం ఉపకరిస్తుంది. కార్తికంలో రెండో రోజైన శుద్ధ విదియను యమద్వితీయగా, సహోదర ద్వితీయగా వ్యవహరిస్తారు. సోదరసోదరీమణుల మధ్య ఉండే అపురూపమైన అనురాగ సరాగాల్ని ప్రకటించే వేడుక- భగినీ హస్తభోజనం.
'భగిని' అంటే సోదరి, భాగ్యవంతురాలని అర్థం. 'భగిని' చేతివంటను సోదరులు ప్రియమారా ఆరగించే పావన తరుణమే భగినీ హస్తభోజన పర్వదినం. కార్తిక శుద్ధ విదియనాడు సోదరీమణుల సమాదరణం చేయాలని లింగపురాణం  ప్రస్తావించింది. అవ్యాజమైన అభిమానంతో సోదరుల్ని ఇంటికి పిలిచి తోబుట్టువులు వారికి సంతృప్తిగా భోజనాన్ని కొసరి కొసరి వడ్డించాలని, సోదరులు తమ అక్కాచెల్లెళ్లను ఘనంగా సత్కరించాలని భవిష్యపురాణం పేర్కొంది. నరకాసుర వధ అనంతరం, శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్ర ఇంటికి వెళ్లాడంటారు. ఆయనకు సుభద్ర విజయ తిలకాన్ని దిద్ది, మంగళహారతి నిచ్చి, మధుర పదార్థాల్ని తినిపించి, రక్ష కట్టిందంటారు. ఆ మహత్తర సందర్భమే భ్రాతృ ద్వితీయగా స్థిరపడిందంటారు.
యమద్వితీయగా ఈ పర్వదినం ప్రశస్తి పొందడానికి ఎంతో నేపథ్యం ఉంది. యమి(యమున) తన అన్న యమధర్మరాజును ఇంటికి ఆతిథ్యానికి రమ్మని ఎన్నోసార్లు ఆహ్వానించింది. అయితే ఆయనకు వీలు చిక్కలేదు. తన అన్న రాకకై యమున ఎదురుచూడసాగింది. అల్పాయుష్కుడైన మార్కండేయుడి ప్రాణాల్ని తన పాశంతో హరించడానికి యముడు వెళ్లాడు. పరమేశ్వరుణ్ని మార్కండేయుడు శరణు వేడాడు. భక్తవశంకరుడైన మహేశుడు త్రిశూలధారియై యముణ్ని వెంటాడాడు. శివాగ్రహానికి భీతిల్లిన యముడు తన సోదరి యమున ఇంటికి పరుగున వచ్చాడు. తన పిలుపు మన్నించి, ఇన్నాళ్లకు తన అన్న వచ్చాడని యమున సంబరపడింది. ఎన్నో మర్యాదలు చేసి, షడ్రసోపేతమైన వంటకాల్ని సిద్ధంచేసి, అన్నగారికి వడ్డించింది. అదే సమయంలో యముణ్ని అన్వేషిస్తూ శివుడు అక్కడికి వచ్చాడు. వంటకాల్ని వడ్డిస్తున్న యమునను, భోజనాన్ని ఆరగిస్తున్న యముణ్ని చూశాడు. వారి అనురాగ బంధాన్ని వీక్షించి ముగ్ధుడై, యముడికి అభయమిచ్చి నీలకంఠుడు నిష్క్రమించాడన్నది పురాణగాథ.
తన సోదరి ఇంట ఆతిథ్యాన్ని అందుకోవడం వల్ల, యముడికి ఈశ్వరుడి ఆగ్రహం బదులు, అనుగ్రహం లభించింది. మహాదేవుడి నుంచి తనను రక్షించినందుకు, మరపురాని వరం కోరుకొమ్మన్నాడు. కార్తిక శుద్ధ విదియనాడు తమ సోదరీమణుల గృహాలకు వెళ్లి, వారి చేత భోజనం స్వీకరించే సోదరులకు సర్వదా అనేక శుభాలు చేకూరాలని, అపమృత్యు దోషాలు తొలగాలని యమున వరం అడిగింది. యముడు తథాస్తు అన్నాడు ఆనందంగా! 'సమవర్తి అయిన యముడి దశనామాల్ని యమద్వితీయనాడు స్మరిస్తూ, అర్ఘ్య ప్రదానం చేయాలి. దక్షిణ దిశాధిపతియైన యముడి ప్రీతి కోసం, దక్షిణ దిక్కున అరటి ఆకులో ఉప్పును కుప్పగా పోసి దానిపై ఆముదంతో యమదీపాన్ని వెలిగించాలి. పితృదేవతలకు సద్గతులు దక్కాలని ఆకాంక్షించాలి'- ఈ విధివిధానాల్ని భవిష్కపురాణం వివరించింది.
'తల్లిదండ్రుల తరవాత ఆత్మీయులైనవారు తోబుట్టువులే! వారి మధ్య బంధాలు, ఆప్యాయతలు నిరంతరం గాఢంగా వర్ధిల్లాలి. జీవితాంతం ఒకరికొకరం తోడునీడగా, అండదండలతో సహోదరులు పురోగమించాలి'. ఈ శుభాకాంక్షల పరంపరకు సాకార దర్శనం- భగినీ హస్తభోజన పర్వదినం!

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్
ఈనాడు దినపత్రిక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

100% C prog to write content into a file and then read it back onto the console

Spic macay

శ్రీరస్తు.. రామలింగ 18-1-24 (సూరసాని వారి ఆహ్వానము)